ఇంటర్నెట్ డెస్క్: దసరా పండుగ (Dasara Festival) వేళ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో ప్రమాదం జరిగి పది మంది భక్తులు మృతి చెందారు. నిమజ్జనం వేళ (Durga immersion) చెరువులో ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో యువతులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 నుంచి 25 మంది ఉన్నట్లు సమాచారం.
ఖాండ్వా జిల్లాలోని పంధానాలోని అర్దాలా గ్రామంలో దుర్గామాత నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు. ఇదే సమయంలో విగ్రహాన్ని తీసుకెళ్లిన ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిపోయింది. అందులో ఉన్నవారు నీటిలో మునిగిపోయారు. స్థానికులు స్పందించి జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీశారు. 11 మందిని వెలికితీయగా.. మిగతా వారికోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.




















