దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే.. మంచి జరుగుతుందని అమ్మవారి భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ పాలపిట్టనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికార పక్షిగా నిర్ణయించింది. ఈ పక్షిని.. నీలకంఠం పక్షి అని కూడా అంటారు.
దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది గురువారం నాడు విజయదశమి వచ్చింది. ఇక, దసరా పండుగ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అంతేకాదు.. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జమ్మి చెట్టుకు సైతం పూజలు చేస్తారు. జమ్మి చెట్టుకు పూజలు చేసిన తర్వాత పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. హిందూ పురాణాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పాల పిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్దికి సంకేతంగా హిందువులు భావిస్తారు. ఈ పక్షిని పరమేశ్వరుడి ప్రతి రూపంగా అనుకుంటారు. అందుకే దసరా పండుగ రోజు పాల పిట్టను చూస్తే అన్నీ శుభాలే జరుగుతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు.
పాల పిట్టకు.. దసరాకు సంబంధం ఏంటి?..
హిందూ పురాణాల ప్రకారం.. త్రేతాయుగంలో విజయ దశమి రోజున రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరిన సమయంలో శ్రీరాముడికి పాలపిట్ట కనిపించింది. ఆ యుద్ధంలో రాముడు విజయం సాధించాడు. దీంతో పాలపిట్టను శభ సూచికంగా శ్రీరాముడు భావించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి
















