మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి తెలిసి ఉండటంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు.జగన్మాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే. ఆది పరాశక్తిగా, దుర్గగా మహిషాసుర మర్దనిగా… కాళీ, చండీ ఇలా ఎన్నెన్నో పేర్లతో పూజలందుకునే ఆ తల్లి సృష్టిలోని స్ర్తీమూర్తులందరికీ ప్రతీక. అసుర సంహారానికి ఆ అమ్మ ధరించిన అవతారాలు ఎన్నెన్నో. మహిషాసుర సంహార వేళ ఆ జగజ్జనని అవతార విశేషమిది.
మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి తెలిసి ఉండటంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు. సకల దేవతల తేజస్సుల నుంచి ఒక చక్కని వీరాంగనను (స్త్రీ శక్తిని) ఆవిర్భవింపజేసి ఆ స్త్రీ శక్తితోనే మహీషుడిని అంతమొందించాలని చెప్పాడు. మహీషుడు సృష్టిలో ఒక స్ర్తీతో తప్ప మరి దేనితోనైనా తనకు మరణం ప్రాప్తించకుండా ఉండేలా వరం పొందిన విషయాన్ని ఆ సమయంలో విష్ణువు, దేవతలు అంతా గుర్తుకు తెచ్చుకున్నారు. స్ర్తీ అంటే చులకన భావంతో… ఆడది తనను ఏమీ చేయలేదన్న అహంభావంతో బ్రహ్మ నుంచి గతంలో మహీషుడు వరం పొందాడు. కనుక స్ర్తీమూర్తితోనే మహిషాసురుడిని అంతం చేయాలని విష్ణువు దేవతలందరికీ విడమర్చి చెప్పాడు. వెంటనే సకల దేవతలూ వారి వారి దేవేరులు అంతా తమ తమ తేజస్సులను, కళాంశాలను బహిర్గతం చేశారు.
అష్టాదశ భుజాలతో…
ముందుగా బ్రహ్మ ముఖం నుంచి గొప్ప తేజోరాశి ఆవిర్భవించింది. ఆ తర్వాత రుద్రతేజం, అనంతరం విష్ణు తేజం వెలువడ్డాయి. ఆ తర్వాత ఇంద్రుడు తన తేజస్సును ఉద్భవింపచేశాడు. అలాగే యమ, అగ్ని, వరుణ, కుబేరుల శరీరాల నుంచి ఒక్కసారిగా తేజస్సులు ఉద్భవించాయి. తేజస్సుల సముదాయం మహోజ్జ్వల రాశిగా అయ్యింది. ఆ దేవ తేజోరాశి నుంచి అసుర సంహారం కోసం శ్రీదేవి అష్టాదశ భుజాలతో ఆవిర్భవించింది. మరో హిమా ద్రిలాగా ఆమె మెరిసిపో సాగింది. దేవతలంతా చూస్తుండగానే అలా ఆవిర్భవించిన దివ్య మూర్తే త్రిగుణ అయిన మహాలక్ష్మి. ఆ దేవి త్రిగుణమయి, అష్టాదశ భుజ జగన్మోహిని, త్రివర్ణగా వెలుగొందింది. ఆమె ముఖం తెల్లని కాంతితోనూ, కళ్లు నల్లగానూ, పెదవులు, అరచేతులు ఎర్రగానూ ఉండి దివ్య భూషిత భూషితై మనోహరంగా ఉంది.
అసుర సంహారం కోసం …
ఇలా దేవ తేజోరాశి నుంచి అసుర నాశనం కోసం ఉద్భవించిన ఆ దేవికి దేవతలంతా కలసి తమ తమ దివ్యాయుధాలను సమర్పించారు. అప్పుడామె మహాశక్తి స్వరూపిణిగా అందరికీ దర్శనమిచ్చింది. ఆమె ఒకే రూపంతో ఉన్నా అసుర సంహారం కోసం అనంతరూపాలను ధరించే శక్తితో ఆవిర్భవించింది. శంకరుడి శ్వేతతేజం నుంచి ఆమె శ్వేతపద్మంలాంటి ముఖం ఉద్భవించింది. ఆమె కేశాలు నల్లగా, పొడవుగా సహజ పరిమళాలతో మనోహరంగా ఉన్నాయి. అవి యముడి తేజం నుంచి ఉద్భవించాయి. ఆమెకు మూడు కళ్లున్నాయి. తెలుపు, నీలం, ఎరుపు వన్నెలతో ఉన్న ఆ కళ్ళు అగ్ని తేజం నుంచి వెలిశాయి. ఆ దేవి కనుబొమలు వంపులు తిరిగి కోమలంగా ఉండి మన్మఽథుని చాపాలను తలపిస్తున్నాయి.
అవి సంజ కెంజాయల నుండి ఏర్పడ్డాయి. ఆమె చెవులు వాయుతేజస్సు నుంచి ఆవిర్భవించాయి. కుందసుమాల లాంటి ఆమె పలువరుసలు దక్షుడి తేజస్సు నుంచి ఏర్పడ్డాయి. ఆమె కింది పెదవి అరుణుడి తేజస్సు నుంచి వెలువడింది. పై పెదవి కూడా ఎర్రగానే ఉండి కార్తికేయుడి తేజస్సుతో సంభవించింది. వైష్ణవ తేజస్సు నుంచి అష్టాదశ భుజాలు రూపుదిద్దుకొన్నాయి. వసువుల తేజస్సు నుండి చిగురుటాకుల లాంటి ఎర్రని వేళ్లు ఉద్భవించాయి. సౌమ్యుని తేజస్సు నుంచి చనుదోయి, ఇంద్రతేజస్సు నుంచి నడుము, త్రివళుల రూపు దాల్చాయి. వరుణుడి ప్రకాశం నుండి తొడలు, జఘన ఆవిర్భావం జరిగింది. ఇలా ఆ శ్రీదేవి సకల దేవతా దివ్య తేజో రూపిణిగా ఆవిర్భవించి అసుర సంహారానికి సంసిద్ధురాలైంది.
అమ్మవారిని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లేనని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు చెప్పారో ఈ కథాసందర్భం వల్ల తెలుస్తుంది. అలాగే శ్రీమహాలక్ష్మి అనగానే చాలామందికి కేవలం ధనాన్ని ప్రసాదించే దేవతగా మాత్రమే తెలిసుంటుంది. కానీ ఆమె సకల దేవతా తేజో స్వరూపిణి. అధర్మాన్ని అంతం చేసే అనంతశక్తి ఉన్న మహిమాన్వి తురాలు అని ‘దేవీ భాగవతం’ పంచమ స్కంధంలోని ఈ కథా సందర్భం వివరిస్తోంది.
















