హైదరాబాద్: ప్రముఖ సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఆర్థిక మోసాల అనుమానాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో నిందితులైన డాక్టర్ నమ్రత, కల్యాణి, నందిని, సంతోషి, జయంత్‌కృష్ణలను కోర్టు అనుమతితో చంచల్‌గూడ జైలులోనే విచారించడం ప్రారంభమైంది.
కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు అక్టోబర్ 28 వరకు నిందితులను జైలులో విచారించనున్నారు.
ఇప్పటికే ఈ కేసు తొలుత గోపాలపురం పోలీస్ స్టేషన్లో నమోదై, అనంతరం సిట్ ఏర్పాటు చేయగా, దర్యాప్తు విస్తరించడంతో ఈడీ కూడా రంగప్రవేశం చేసింది.
విచారణలో భాగంగా అధికారులు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించగా, వారు భారీ స్థాయిలో అస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ఇటీవల నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ, ఇప్పుడు వాటి ఆధారంగా మరిన్ని వివరాలను వెలికి తీయనుంది.
ఈడీ అధికారులు నిందితుల ఆర్థిక లావాదేవీలు, మోసపూరిత పద్ధతులు, ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాలపై వివరంగా విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ ఫలితాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


















