రాష్ట్రంలో నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్యసేవలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో సచివాలయంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి.
ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు తమకు ఉన్న రూ.2,700 కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. బకాయిల కారణంగా వారు వైద్యసేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే రూ.250 కోట్లు చెల్లింపునకు చర్యలు పూర్తయ్యాయని, త్వరలో మరో రూ.250 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దశలవారీగా అన్ని బకాయిలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని, ప్రజలకు వైద్యసేవలు నిరంతరంగా అందించడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
పూర్తిస్థాయిలో వైద్యసేవలను పునరుద్ధరించే దిశగా చర్చలు సానుకూలంగా సాగినట్లు తెలిసింది. త్వరలోనే ఎన్టీఆర్ వైద్యసేవలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.



















