మంగళగిరి, అక్టోబర్ 23, 2025:
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్య విద్యను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) పద్ధతిలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా వైద్య విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో వైద్య విద్య పూర్తిగా కుంగిపోయిందని విమర్శించారు. “గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున ప్రచారం తప్ప జగన్ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయాడు,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీపీపీ విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని, అదే నమూనాలో రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పద్ధతిలో ప్రభుత్వమే కళాశాలలు, ఆసుపత్రులు నడిపిస్తుందని, ప్రైవేటు రంగం కేవలం మౌలిక వసతుల నిర్మాణానికే పరిమితమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
జగన్ ప్రచారం చేస్తున్నట్లుగా భూములను శాశ్వతంగా ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారని చెప్పడం పూర్తిగా అబద్ధమని నసీర్ అహ్మద్ కొట్టిపారేశారు. “జీవో నంబర్ 590 ప్రకారం భూములు కేవలం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో మాత్రమే ఇవ్వబడతాయి. ఆ గడువు తర్వాత అవి తిరిగి ప్రభుత్వానికి వస్తాయి,” అని ఆయన వివరించారు.
రాబోయే రెండు సంవత్సరాల్లో 1750 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని, అందులో 220 కొత్త సీట్లు చేరనున్నాయని చెప్పారు. వీటిలో 110 సీట్లు కన్వీనర్ కోటా కింద మెరిట్ విద్యార్థులకు కేటాయిస్తామని తెలిపారు. అలాగే SC, ST, BC, మైనారిటీలకు రిజర్వేషన్ ప్రకారం అవకాశాలు ఇవ్వనున్నామని హామీ ఇచ్చారు.
జగన్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రూ.630 కోట్ల నిధులను సరిగా వినియోగించకపోవడం వల్ల మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని నసీర్ అహ్మద్ విమర్శించారు. “జగన్ హయాంలో వైద్య విద్య కుంటుపడింది, కానీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కొత్త అవకాశాలు తీసుకువస్తోంది,” అని ఆయన స్పష్టం చేశారు.
మద్యం నియంత్రణ విషయంలో కూడా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. “జగన్ పాలనలో ఒక్క మద్యం బాటిల్‌పై అయినా క్యూ ఆర్ కోడ్ వేసి అమ్మారా?” అని ప్రశ్నించారు. నకిలీ మద్యం కారణంగా జంగారెడ్డిగూడెంలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేశారు. “మద్యం వ్యాపారి అయిన జగన్ రెడ్డి ఈరోజు నీతి వాక్యాలు చెబుతుండటం దురదృష్టకరం,” అని వ్యాఖ్యానించారు.
నకిలీ మద్యం తయారీలో పాల్గొన్న ముఠా మేస్త్రి జోగి రమేశ్ జగన్ కు సన్నిహితుడని ఆరోపిస్తూ, ప్రజల భద్రత కోసం కూటమి ప్రభుత్వం ‘సురక్ష యాప్’ ద్వారా నకిలీ మద్యం విక్రయాలను అరికట్టే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
చివరిగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, “ప్రజలను మోసం చేయాలన్న జగన్ ప్రయత్నాలు ఇక ఫలించవు. ఆయన అబద్ధాలకు ప్రజలే తగిన సమాధానం ఇస్తారు,” అని హెచ్చరించారు.




















