ఈనాడు, హైదరాబాద్: భూమి గుంటల్లోనే ఉంటుంది. విక్రయాలు మాత్రం గజాల చొప్పున చేస్తూ ఫాం ల్యాండ్స్ పేరిట కొందరు అంటగడుతున్నారు. భవిష్యత్‌లో ఎలాగో నిర్మాణాలు చేసుకుంటారు కదా. అందాక సాగు భూమి కిందనే ఉంచుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తీసుకోవచ్చు అంటూ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరం సరిహద్దుగా ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని మండలాల్లో ఈ తరహా వ్యాపారం జోరుగా సాగుతోంది.
ఏటా 80 వేల విక్రయ లావాదేవీలు
నగర శివార్లలో ఏటా దాదాపు 80 వేల ఫాంల్యాండ్స్ విక్రయ లావాదేవీలు జరుగుతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో సాగుభూముల విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్లు ఏటా 6.10 లక్షలు జరుగుతుండగా వాటిలో నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఫాం ల్యాండ్స్ విక్రయాలు ఉంటున్నాయి. కొన్ని స్థిరాస్తి సంస్థలు నిబంధనల మేరకు విక్రయాలు చేస్తుండగా ఆ సమీప ప్రాంతాల్లో మరికొందరు దందా చేస్తున్నారు.
వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన మార్గంలోని పలు మండలాల్లో ఎకరా రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్న పలువురు ఆ భూమి ధరకు రెండింతలు అప్పనంగా కొల్ల గొడుతున్నారు. చ.గజం రూ.5,500 నుంచి రూ.6,500 లోపే అంటూ ప్రచారం చేస్తున్నారు. కొనుగోలుదారులు బేరసారాలకు దిగాక వారిని ఒప్పించి సాగు భూమి కిందనే పట్టాపాసుపుస్తకాలిచ్చి గజాల కింద వసూలు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు నష్టం లేకపోవడంతో ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు.
నష్టం ఇలా..
- జరుగుతున్న విక్రయాల్లో గుంట (121చ.గజాలు) నుంచి మూడు గుంటల విస్తీర్ణాలు ఎక్కువగా ఉంటున్నాయి.
- భవిష్యత్‌లో ఈ స్థలంలో నిర్మాణం చేయాలంటే స్థానిక సంస్థల (పంచాయతీ/పురపాలక/నగరపాలక) నుంచి అనుమతి తప్పనిసరి. సాగుభూమిని సాగేతర ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నట్లు (నాలా-నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్‌మెంట్) అనుమతి పొందాలి.
- ఈ భూమి సరిహద్దుగా సాగునీటి కాలువలు కానీ, చెరువులు, కుంటలు ఉంటే నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి.
- భవనాల నిర్మాణానికి డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అనుమతి అవసరం.
- ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది.


















