వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో గురువారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ మరోసారి కోరగా, సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. గత ఆరు సంవత్సరాలుగా ఆయన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని, ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున తప్పనిసరిగా ప్రత్యక్షంగా హాజరవాల్సిందిగా సీబీఐ వాదించింది. దీనిపై కోర్టు ఈ నెల 21లోగా ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఒకరోజు ముందుగానే కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఇటీవల ఆయన కోర్టు అనుమతితో ఐరోపా పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగిశాక ప్రత్యక్ష హాజరు అవసరమని ఆదేశించినప్పటికీ, ఆయన మళ్లీ మినహాయింపు కోరారు. దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఇప్పుడు కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. 2013 సెప్టెంబరు నుండి ఈ కేసులో జగన్ బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే.



















