విజయవాడ: నకిలీ మద్యం ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ దేవీదేవతల సాక్షిగా ప్రమాణం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా హాజరైన ఆయన, తనపై వస్తున్న ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు.
జోగి రమేష్ గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఆ సవాల్‌పై వారిద్దరూ స్పందించలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను చేసిన సవాల్‌కు కట్టుబడి, దేవాలయంలో ప్రమాణం చేశానని స్పష్టం చేశారు.
“నా చేత ఏ తప్పూ జరగలేదు. న్యాయంగా ప్రజల ముందే ప్రమాణం చేశాను,” అని జోగి రమేష్ తెలిపారు. దేవీదేవతల సాక్షిగా చేసిన ఈ ప్రమాణం ద్వారా తన నిజాయితీని మరోసారి నిరూపించానని ఆయన పేర్కొన్నారు.




















