అప్పట్లో రిపబ్లిక్ డే వస్తుందంటే చాలు, వారం రోజుల ముందు నుంచే మనకు తెలియని ఒక ఉత్సాహం మొదలయ్యేది. తెల్లవారుజామునే అమ్మ నిద్రలేపి, తలంటు పోసి, తెల్లటి యూనిఫాం వేసి సిద్ధం చేస్తుంటే.. ఆ రోజు మనం ఏదో పెద్ద సాహసం చేయబోతున్నామనే గర్వం ఉండేది. స్కూల్‌కి వెళ్లగానే ఆ జెండా పండుగ హడావిడి, తోటి స్నేహితులతో కలిసి జెండాలు పట్టుకుని ఊరంతా తిరుగుతూ మనం ఇచ్చిన నినాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇక జెండా వందనం అయ్యాక, సార్ చేతుల మీదుగా ఆ ఒక్క లడ్డూ కోసం క్యూలో నిలబడటం.. ఆ చిన్న లడ్డూలో దొరికినంత ఆనందం ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. అప్పుడప్పుడు స్టేజ్ మీద తడబడుతూ వేసిన డ్యాన్సులు, ముక్తకంఠంతో పాడిన దేశభక్తి గీతాలు మనల్ని మళ్ళీ ఆ అమాయకమైన, మధురమైన జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. నిజంగా బాధ్యతలు తెలియని ఆ చిన్నప్పటి దేశభక్తి, ఆ స్వచ్ఛమైన సంతోషం ఎప్పటికీ వెలకట్టలేనివి.




















