హైదరాబాద్, అక్టోబర్ 16: దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని స్వీట్ షాపులపై జీహెచ్ఎంసీ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. నగరంలోని 43 స్వీట్ షాపులలో మూడు రోజులపాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగింది.
అధికారుల తనిఖీలలో, కొన్ని షాపులు గడువు ముగిసిన పదార్థాలను స్వీట్ల తయారీలో వాడుతున్నాయి అని గుర్తించారు. అలాగే, షాపులలో అమ్మే మిఠాయిలపై లేబెల్ లేదా ఎక్స్ పైరీ డేట్ చూపడం లేదని అధికారులు వెల్లడించారు.
తదుపరి తనిఖీలలో, మిఠాయిలలో ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. కొన్ని వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీపావళి పండుగలో గిరాకీ ఎక్కువగా రావడంతో, టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
నిబంధనలు పాటించని స్వీట్ షాపులపై నోటీసులు జారీ చేయడం, భారీ పెనాల్టీలు విధించడం వంటి చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రజలకు పండుగ సురక్షితంగా జరగడం, ఆహార నాణ్యతను కాపాడడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.


















