ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం చాలామందికి సాధారణమే. అదే బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (OD) లోన్ పొందే అవకాశం కూడా ఉందని మీకు తెలుసా? ఇది సాధారణ వ్యక్తిగత లోన్ లాగా కాకుండా, క్రెడిట్ లైన్‌లా పనిచేస్తుంది.
సాధారణ గోల్డ్ లోన్‌లో మొత్తం డబ్బును ఒక్కసారిగా తీసుకుని వడ్డీ చెల్లించాలి. కానీ ఓవర్‌డ్రాఫ్ట్‌లో, మీ బంగారు ఆభరణాల విలువ ఆధారంగా బ్యాంక్ ఒక పరిమిత రుణాన్ని మంజూరు చేస్తుంది. మీరు ఆ పరిమితి వరకు ఎప్పుడైనా, ఎన్ని సొమ్ము కావలసినంత మాత్రమే డ్రా చేసుకోవచ్చు. వడ్డీ మాత్రం మీరు విత్‌డ్రా చేసిన అసలు మొత్తంపై మాత్రమే లెక్కించబడుతుంది, మొత్తం మంజూరైన పరిమితిపై కాదు. ఈ రుణాన్ని సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉపయోగించవచ్చు. అవసరమైతే తిరిగి చెల్లించి, మళ్లీ తీసుకోవచ్చు.
ఓడీ పొందడానికి కొన్ని ధ్రువపత్రాలు సమర్పించాలి. సాధారణంగా 18 నుంచి 24 క్యారెట్ స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఈ సౌకర్యాన్ని ఇస్తాయి. మీరు కోరుకున్న రుణ పరిమితిని బట్టి తగినంత బరువు ఉన్న బంగారాన్ని బ్యాంక్‌కు ఇవ్వాలి. సాధారణంగా ఆ బంగార విలువలో 70–75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి మంజూరు అవుతుంది.
వడ్డీ రోజువారీగా లెక్కించబడుతుంది. బ్యాంక్ ప్రకారం సంవత్సరానికి 8–15% మధ్య వడ్డీ రేటు ఉంటుంది. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తాయి, ఇది మంజూరైన పరిమితిలో 0.5–1.5% వరకు ఉండవచ్చు.
ఈ సౌకర్యాన్ని ఫెడరల్ బ్యాంక్ (DG Gold OD Scheme), CSB బ్యాంక్ (Gold OD Scheme), తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB Gold OD Scheme), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Gold SOD Facility) వంటి బ్యాంకులు అందిస్తున్నారు. పైన పేర్కొన్న బ్యాంకులు తమ ఖాతాదార్లకు బంగారు ఓడీ సౌకర్యాన్ని ఇస్తున్నాయి.




















