తిరుమలలోని వెంకమాంబ అన్నవితరణ కేంద్రంలో ఈరోజు ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అధికారులు, సిబ్బంది, అన్నదానం ట్రస్టు దాతలు పాల్గొన్నారు.
ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, “నిత్య అన్నదానం కార్యక్రమం 1985లో ప్రారంభమైంది. 1994లో ఈ సేవ ‘ట్రస్టు’గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి భక్తుల విరాళాలు, దానాలు గణనీయంగా పెరిగాయి,” అని తెలిపారు.
ప్రస్తుతం ట్రస్టులో సుమారు ₹2,300 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. వాటిపై వచ్చే వడ్డీ ద్వారా ప్రతి సంవత్సరం నిత్య అన్నదానం కార్యక్రమం కొనసాగుతోందని ఈవో పేర్కొన్నారు.
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో ₹180 కోట్లు విరాళాలు వచ్చినట్లు తెలిపారు. అంటే రోజుకి సగటున ₹1 కోటి చొప్పున భక్తులు విరాళాలు అందిస్తున్నారని వివరించారు. “టీటీడీపై భక్తుల విశ్వాసమే ఈ విరాళాల వెనుక ప్రధాన బలం” అని ఆయన అన్నారు.
ఈవో మాట్లాడుతూ, “టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో నిత్య అన్నదానం చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని అన్ని దేవాలయాలకు విస్తరిస్తాం. అలాగే అన్నదానం సిబ్బందిని పెంచే నిర్ణయం కూడా తీసుకున్నాం,” అని వెల్లడించారు.
అలాగే, 5,000 ఆలయాల నిర్మాణం కోసం ప్రతి ఆలయానికి స్థలం, అవసరాన్ని బట్టి ₹10 లక్షలు, ₹15 లక్షలు లేదా ₹20 లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. మొత్తం ₹750 కోట్లు విడుదల చేయాలని ఆమోదించాం అన్నారు.
“మొదట 25 శాతం నిధులను ఆలయాల నిర్మాణానికి ముందస్తుగా ఇస్తాం. దేవాదాయ శాఖ గ్రామాల ఎంపిక చేసి, నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదురుస్తుంది. ఎంపిక పూర్తయ్యాక మేము విడుదల చేసే నిధులతో పనులు ప్రారంభిస్తారు,” అని ఈవో తెలిపారు.
చివరగా ఆయన అన్నారు – “5,000 ఆలయాల నిర్మాణం ఒక మహత్తర కార్యక్రమం. దీనివల్ల ఆధ్యాత్మికతతో పాటు గ్రామీణ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుంది,” అని.
🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏



















