న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు దాటాయి. జీఎస్టీ రేట్లు తగ్గించినా, పండగ సీజన్‌లో కొనుగోళ్లు పెరగడం వలన వసూళ్లు ఊహించినదానికంటే ఎక్కువగా నమోదయ్యాయి.
ప్రభుత్వం శనివారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 4.6 శాతం వృద్ధి సాధించాయి.
రేట్లు తగ్గినా కొనుగోళ్లు పెరిగాయి
సెప్టెంబర్ 22 నుంచి కిచెన్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ సహా మొత్తం 375 ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో, వినియోగదారులు పండగ సీజన్‌లో భారీగా షాపింగ్ చేశారు. దసరా నవరాత్రుల నుంచి కొత్త రేట్లు అమల్లోకి రాగా, దీపావళి కొనుగోళ్ల ఉత్సాహం కూడా వసూళ్లకు బలాన్నిచ్చింది.
అదనంగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో “దీపావళికి ముందే జీఎస్టీ రూపంలో శుభవార్త వింటారు” అని చెప్పడంతో చాలా మంది కొనుగోళ్లు వాయిదా వేసి, అక్టోబర్‌లో జరిపారు.
గణాంకాలు ఇలా చెబుతున్నాయి
గత ఏడాది అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈసారి అది రూ.1.96 లక్షల కోట్లకు చేరింది.
- ఆగస్టు 2025: రూ.1.86 లక్షల కోట్లు
- సెప్టెంబర్ 2025: రూ.1.89 లక్షల కోట్లు
- అక్టోబర్ 2025: రూ.1.96 లక్షల కోట్లు
సగటున 9 శాతం వృద్ధి సాధారణంగా నమోదవుతున్నప్పటికీ, ఈసారి పండగ ప్రభావం వల్ల వృద్ధి కొంత తగ్గినా మొత్త ఆదాయం మాత్రం అత్యధిక స్థాయిలో ఉంది.
వసూళ్ల వివరాలు
మొత్తం జీఎస్టీ వసూళ్లలో:
- రూ.1.45 లక్షల కోట్లు దేశీయ వినియోగం ద్వారా
- రూ.50,884 కోట్లు దిగుమతులపై సుంకాల రూపంలో లభించాయి.
జీఎస్టీ రిఫండ్లుగా రూ.26,934 కోట్లు చెల్లించిన తరువాత నికర వసూళ్లు రూ.1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ఈ వసూళ్లు జీఎస్టీ అమలు తర్వాతి కాలంలో రెండవ అత్యధిక రికార్డుగా నిలిచాయి. పండగల కాలం కొనసాగుతున్నందున నవంబర్ నెలలో కూడా వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.




















