కోనసీమ అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సాంప్రదాయ మండువా గృహాలు సిద్ధమవుతున్నాయి. పాత కాలపు ఆ ఇళ్లను ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో ముస్తాబు చేస్తూ హోంస్టేలుగా మార్చుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంస్టే విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, అధికారులు ఎంపిక చేసిన ఇళ్లతో ఈ కార్యక్రమం మొదలైంది.
గూడాల, పేరూరు, తూర్పుపాలెం, కేశనపల్లి, పెదపట్నంలంక, శేరిలంక, ముమ్మిడివరం, అయినవిల్లి, మండపేట వంటి గ్రామాల్లో ఉన్న ఆకర్షణీయమైన మండువా గృహాలను ఎంపిక చేసి, యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులు సౌకర్యవంతంగా ఉండేందుకు ఆ ఇళ్లను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. స్వచ్ఛందంగా హోంస్టేలా మార్చుకోవాలనుకునే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 20 ఇళ్లను గుర్తించి, అవసరమైన వసతులు కల్పిస్తున్నామని పర్యాటక శాఖ జిల్లా అధికారి అన్వర్ తెలిపారు. 2029 నాటికి జిల్లాలో 400 ఇళ్లను హోంస్టేలుగా నమోదు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




















