ఈనాడు, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ సాయంత్రం వేళ బీటెక్ చదువుకునే అవకాశం కల్పించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఎప్‌సెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర వాటి మాదిరిగా కన్వీనర్‌ను నియమించేందుకు పరీక్షలు, ప్రవేశాలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదన పంపినట్లు సమాచారం. విద్యాశాఖ జీఓ జారీ చేస్తే ఆ వెంటనే చర్యలు చేపట్టేందుకు విద్యామండలి సిద్ధమైంది.
గత విద్యా సంవత్సరం(2024-25) ఓయూ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఆ వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు, జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఆ వర్సిటీ అనుబంధ గుర్తింపు ఉన్న మరో ఆరు కళాశాలల్లో సాయంత్రం బీటెక్‌లో ప్రవేశాలు కల్పించారు. ఈసారి వర్సిటీలు, సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల వందల మంది బీటెక్ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. విధి విధానాలు, ఫీజులు తదితర అంశాలపై దిశానిర్దేశం చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఈసారి ఓయూకే నోటిఫికేషన్
2025-26 విద్యా సంవత్సరానికి ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని 150 సీట్లకే ప్రవేశాలు కల్పిస్తామని ఆ కళాశాల కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(సీప్) పేరిట జులైలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 24న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే దరఖాస్తు గడువును అధికారులు అక్టోబరు 5 వరకు పొడిగించారు. అక్టోబరు 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఓయూలోని పార్ట్‌టైమ్ ఎంటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీ తర్వాత లేటరల్ ఎంట్రీ బీటెక్ చేపట్టాలని గడువును పెంచామని ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.చంద్రశేఖర్ తెలిపారు.




















