ముంబయి: బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించేందుకు ఒక ఏడాది పాటు కొనసాగే ప్రోత్సాహక పథకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ‘స్కీమ్ ఫర్ ఫెసిలిటేటింగ్ యాక్సెలరేటెడ్ పేఅవుట్-ఇనాపరేటివ్ అకౌంట్స్ అండ్ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్’ కింద ఖాతా నిర్వహణలోని కాలం, డిపాజిట్ల మొత్తాన్ని బట్టి బ్యాంకులు వేర్వేరు మొత్తాల్లో ప్రోత్సాహకాలకు అర్హత సాధిస్తాయి. ప్రస్తుత అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడంతో పాటు, కొత్తగా ఈ విభాగంలో నిధులు జమవకుండా చూడటమే ఈ పథకం లక్ష్యమని ఆర్‌బీఐ తెలిపింది. అక్టోబరు 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఇటువంటి ఒక్కో ఖాతాపై బ్యాంకులకు రూ.25,000 వరకు ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్ నాటికి ఎవరూ క్లెయిము చేసుకోని డిపాజిట్ల మొత్తం రూ.67,000 కోట్లుగా ఉంది.




















