ఉక్రెయిన్ యుద్ధంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, భారత రిఫైనరీలు రష్యా నుంచి కొత్త చమురు ఆర్డర్లను ఇవ్వడం నిలిపివేశాయి. తాత్కాలికంగా చమురు కొనుగోలు నిలిపివేసి, ఆంక్షలపై స్పష్టత కోసం వేచిచూసే విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంతేకాక, అవసరమైన చమురు లోటును స్పాట్ మార్కెట్ల ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఈ విషయం రిఫైనరీలలో కీలక వ్యక్తులు మంగళవారం వెల్లడించారు (ఎకనామిక్ టైమ్స్).
రష్యా చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్ మరియు వాటి అనుబంధ కంపెనీలపై అమెరికా అక్టోబర్ 22న నిషేధం విధించింది. అమెరికా సంస్థలు, వ్యక్తులు ఈ కంపెనీల నుంచి చమురు కొనుగోలు చేస్తే, పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా పేర్కొంది. అలాగే, నవంబర్ 21 వరకు ఆ సంస్థలతో కొనసాగుతున్న అన్ని లావాదేవీలను ముగించమని ఆదేశించింది.
ప్రస్తుతం భారత ముడి చమురు దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుండే వస్తోంది. 2025లో ఇప్పటివరకు సగటున రోజుకు 1.7 మిలియన్ బారెళ్లు (MPD) చమురు దిగుమతి చేయగా, దాంట్లో 1.2 MPD రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌ల నుండి వచ్చింది. ఎక్కువ భాగాన్ని రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేశాయి.
పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు పెరగడం కారణంగా, భారత కంపెనీలు ముడిచమురు కోసం పశ్చిమ ఆసియా వైపు దృష్టి సారించాయని వాణిజ్య, ప్రభుత్వ వర్గాలు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ అంశంపై స్పందిస్తూ, రిఫైనరీ ఉత్పత్తుల దిగుమతుల విషయంలో యూరోపియన్ యూనియన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుస్తామని, అమెరికా, బ్రిటన్, ఈయూ ప్రకటించిన ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని తెలిపింది.
అలాగే, అమెరికాకు సహకారం చూపే సంకేతాలుగా, భారత రిఫైనరీలు అమెరికా కంపెనీల నుంచి చమురు బుకింగ్ పెంచినట్లు వాణిజ్య, ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు.




















