ముంబయి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ, మార్కెట్లలో అనుకున్న ఊపును తీసుకురాలేకపోయింది. ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ ఈ ఏడాదిలో మరిన్ని వడ్డీ కోతలు ఉండబోవని సంకేతాలు ఇవ్వడంతో, మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దాంతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా రంగాలకు చెందిన షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందంపై సానుకూల వార్తలు వచ్చినప్పటికీ, మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించారు.
బీఎస్ఈ సెన్సెక్స్ 84,750.90 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, రోజంతా దిగువ స్థాయిల్లోనే కొనసాగింది. చివరికి 592.67 పాయింట్లు పడిపోయి 84,404.46 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 176.05 పాయింట్లు నష్టపోయి 25,877.85 వద్ద స్థిరపడింది.
రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 88.70 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌లో భాగమైన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. కాగా ఎల్‌అండ్‌టీ, బీఈఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.53 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 3,986 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
నిపుణుల ప్రకారం, ఫెడ్ నిర్ణయాలు తాత్కాలికంగా మార్కెట్లపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, రాబోయే వారాల్లో గ్లోబల్ ఆర్థిక సంకేతాల ఆధారంగా మార్కెట్ దిశ నిర్ణయించబడనుంది.




















