ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సాక్షిగా ప్రమాణ స్వీకారం
అమరావతి, అక్టోబర్ 27:
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనను ప్రమాణ స్వీకారం చేయించారు.
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయ విద్య పూర్తి చేసిన అనంతరం 2002లో జిల్లా జడ్జి క్యాడర్‌లో నియమితులై తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో న్యాయసేవలు అందించారు. 2015 జూలైలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, అనంతరం 2019 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
తరువాత 2023 నవంబర్‌లో గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన, తిరిగి స్వరాష్ట్రానికి వచ్చి మరోసారి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి అనేకమంది ప్రముఖ న్యాయవేత్తలు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు సిబ్బంది, ఎపి లీగల్ సర్వీసెస్ అథారిటీ, జ్యుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం తరఫున విడుదల చేశారు.
























