నయనార్లు గొప్ప శివ భక్తులు.
భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి…
కార్తీకమాసం సందర్భంగా వారి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం…..
భక్త కన్నప్ప నాయనారు
🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
పోతప్పినాడు అనే రాజ్యంలో, ఉడుప్పూర్ గ్రామములో నాగడు అను ఒక బోయరాజ దంపతులకు ‘తిన్నడు” పుట్టాడు.
తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవాడుగా తన కులధర్మమును అనుసరించి వేటాడినా – తిన్ననికి అన్ని జీవులయెడల – వాత్సల్యము, ప్రేమాభిమానములు అభివృద్ధి నొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులని వేటాడేవాడు కాదు.తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు.
ఒక రోజున తిన్నడు వేటకు వెళ్లాడు. ఒక సూకరము (అడవిపంది) అతని వలనుంచి తప్పించుకొని పారిపోజూచింది. దానిని తరుముకుంటూ వెళ్లాడు. స్వర్ణముఖీ నదీ తీరానికి చేరారు. కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి – ఆ దేవాలయమును చూడదలచాడు. “అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు – కుడుము దేవారు (అంటే పిలక ఉన్న దేవుడు)” .
తిన్నడు ఆ పర్వతము ఎక్కడం ప్రారంభించాడు. ఆ పర్వత మెక్కుతుంటే, తిన్ననిలో మార్పు కానవచ్చింది. అది పూర్వ జన్మసంస్కార ఫలము.
అక్కడి శివలింగమును చూడగానే, దానిమీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు.
ఆనంద భాష్పాలు రాలటంతో, శివునితో, “ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా వున్నావు? నీకు ఆహరము ఎలా లభిస్తోంది? ఇప్పటినుండి నేనూ నీతోనే వుంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది. నేను ఆహారము తీసుకుని వస్తాను” అని పలికి, శివుని ఆకలిదీర్చుటకు వెంటనే కొండ దిగాడు. నదివద్దకు వెళ్ళి, నోటినిండా నీళ్లను పుక్కిలి బట్టి, తను సేకరించిన పూలను తలమీద వుంచుకొని, పచనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని, విల్లు అంబులతో, తిన్నగా గుడికి వెళ్లాడు.
అక్కడ, పుక్కిలిబట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయింది. తన తల మీదవున్న పూలతో శివుని అలంకరించాడు. అదే శివునికి అర్చన అయింది. తర్వాత, తాను తెచ్చిన మాంసమును దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయింది.
ఆ గుడి ద్వారము వద్ద, ఎవరిని, ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము, మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు.
తిన్నడు దేవునికి ఆహారము సేకరించటానికి వెళ్ళగా, ఆ సమయంలో, ఆలయ అర్చకుడు శివగోచారి, శివునికి ప్రతీరోజులానే అర్చన చేయడానికి వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రము చేశారని భావించాడు. అక్కడ వున్న మాంసము మొదలగువానిని తొలగించి మంత్ర యుక్తముగా సంప్రోక్షణ గావించి, మళ్ళీ స్నానము చేసి, మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖీ జలములతో అభిషేకము చేసి, పూలతోనలంకరించి, విభూతినలిమి, తెచ్చిన పళ్లు మధుర పదార్ధములతో నివేదన గావించి వెళ్ళాడు.
పూజారి వెళ్ళగానే, తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజాద్రవ్య మూలను తీసివేసి, తనదైన పద్ధతిలో పూజచేశాడు.
ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి.
పూజారి ఇక ఉండబట్టలేక పోయాడు.
దుఃఖిస్తూ పరమశివుని ప్రార్ధించాడు. “ఈ ఘోర కలిని ఆపండి” అని ఎలిగెత్తి ప్రార్ధించాడు.
శివుడు పూజారికి తిన్నడి భక్తి ప్రపత్తులను చూపించ దలచాడు.
అర్చకునకు కలలో కనిపించి, “నీవు లింగము వెనుక దాగియుండు. బయటకు రాక, అక్కడ ఏమి జరుగుచున్నదో గమనించుము” అని ఆదేశించాడు.
ఆఱవ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వెళ్లి చూడగానే – శివుని కుడికన్ను నుండి రక్తము బయటకి వస్తోంది.
దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలోనుండి క్రింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పనిచేశారో తెలియలేదు.
తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. కాని రక్తము ఆగలేదు.
వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. వెంటనే బాణంతో తన కుడి కన్నును పెకలించి శివునికి పెట్టాడు.
రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తుండగా – ఇప్పుడు శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు.
భయము లేదు, మందు తెలిసిందిగా, కాని ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను గూడ తీసిన తరువాత, శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించడం ఎలా? అందుకని, గుర్తుకోసం, తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై బెట్టి, తన ఎడమ కన్నును పెకలించుకోబోయాడు.
పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయి, తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. “నిలువుము కన్నప్పా! కన్నప్పా! నీ భక్తికి మెచ్చాను.. నా హృదయమునకు సంపూర్ణానందము కలిగినది కన్నప్పా!” అని ప్రశంసించాడు.
ఇదంతా చూస్తున్న పూజారికి తిన్నడి భక్తి తెలిసి వచ్చింది.
కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటినుండి, సాక్షాత్తూ శివ స్వరూపుడై జీవించాడు.
తన కళ్ళని పెకలించి శివుని కిచ్చుటలో, తిన్నని సంపూర్ణ శరణాగతి, ఆత్మ నివేదన గోచరిస్తుంది. అంతకన్న అనితరమైన భక్తి తత్పరత వేరే కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప చేస్తుంది. చేయగలదు
ఓం నమశ్శివాయ…
హర హర మహాదేవ. శంభో శంకర.
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



















