ఇంటర్నెట్ డెస్క్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విదేశీ విద్యార్థుల రాకపై కఠిన నియమాలను విధిస్తోంది. “సోషల్ వెట్టింగ్” వంటి పలు విధానాల ద్వారా అమెరికన్ డ్రీమ్ చేరుకోవడాన్ని కొంతమేర కష్టతరం చేస్తోంది. ఈ క్రమంలో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఓ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీని ప్రకారం అంతర్జాతీయ విద్యార్థుల Optional Practical Training (OPT) ప్రోగ్రామ్పై పరిమితులు విధించవచ్చు లేదా పూర్తిగా రద్దు చేయవచ్చు. ఈ నియమం ఫెడరల్ రెగ్యులేటరీ అజెండాలో చేర్చబడింది. 2025 చివర లేదా 2026 ప్రారంభంలో దీన్ని అమలు చేయవచ్చని తెలుస్తోంది.
అమెరికాలో బీటెక్ లేదా తత్సమాన అండర్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎఫ్-1 వీసా విద్యార్థులు, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సులలో ఎంఎస్ చదువుకుంటారు. విద్యార్థులు పీజీ పూర్తి అయిన తర్వాత OPT కోసం దరఖాస్తు చేస్తారు. OPT వచ్చిన మొదటి ఏడాదిలో స్టెమ్ రంగంలోని సంస్థల్లో మాత్రమే పని చేయవలసి ఉంటుంది. తర్వాత మరో రెండు సంవత్సరాలు కూడా స్టెమ్ రంగంలోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కొంతమంది H-1B వీసా పొందడానికి ప్రయత్నిస్తారు.
కానీ, కొన్ని అమెరికా సంస్థలు OPTను భారతదేశం సహా ఇతర దేశాల విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టి, ట్రంప్ యంత్రాంగం OPT ప్రోగ్రామ్ రద్దు అంశంపై చర్యలు తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారి OPT రద్దు అయినా, భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువు కోసం వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. యూనివర్సిటీలకు కూడా ఆర్థిక నష్టం ఉండవచ్చు.
అయితే, ట్రంప్ ఇటీవల వ్యాఖ్యల్లో, విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని, వారు అమెరికా వ్యాపారాలకు మంచిదని, దేశ విద్యావ్యవస్థకు మద్దతుగా ఉంటారని పేర్కొన్నారు.




















