ఇంటర్నెట్ డెస్క్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కిష్కింధపురి’ చిత్రం హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమైంది.
జీ ఫైవ్ వేదికగా అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుండి ఈ సినిమా ప్రసారమవుతుందని అధికారికంగా ప్రకటించారు. అలాగే అక్టోబర్ 19న సాయంత్రం జీ టీవీలో ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
కథ:
రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైతిలి (అనుపమ) ప్రేమజంట. వీరిద్దరూ తమ స్నేహితుడు (సుదర్శన్)తో కలిసి “భూతాల యాత్రలు” అనే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. థ్రిల్ కోరుకునే వారిని పాడుబడ్డ బంగ్లాలకు తీసుకెళ్లి అక్కడ దెయ్యాలు ఉన్నాయనే నమ్మకంతో భయానక అనుభవం కలిగించడం వారి పని.
ఒకసారి వారు పదకొండు మందితో కలిసి “కిష్కింధపురి” గ్రామం దగ్గర ఉన్న “సువర్ణమాయ” అనే పాత రేడియో స్టేషన్‌కి వెళ్తారు. 1989లోనే అది మూసివేయబడింది. ఆ స్టేషన్‌లోకి అడుగుపెట్టిన తర్వాత వారందరికీ “వేదవతి” అనే ఆత్మ హెచ్చరిక ఇస్తుంది “ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరూ బతకరని!”
తర్వాత అక్కడి ఒక చిన్నారి ఆ దెయ్యం లక్ష్యంగా మారుతుంది. ఆ విషయాన్ని గ్రహించిన రాఘవ్ తన ప్రాణాలనే పణంగా పెట్టి దెయ్యానికి ఎదురెళ్తాడు.
మరి ఆ చిన్నారిని రక్షించగలిగాడా? మిగతావారి పరిస్థితి ఏమైంది? ఆ వేదవతి ఎవరు? ఎందుకు ఆత్మగా మారింది? సువర్ణమాయ స్టేషన్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? అక్కడికి వెళ్లిన వారిని ఎందుకు చంపుతోంది? ఇవే చిత్రంలోని ఉత్కంఠభరితమైన ప్రశ్నలు.



















