దిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్), స్వాతంత్య్ర సమరయోధులు వంటి అంశాలపై త్వరలో దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనలు జరగనున్నాయి. ‘రాష్ట్రనీతి’ పేరుతో 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో కొత్త అధ్యాయాల్ని భాగం చేయనున్నట్లు మంగళవారం దిల్లీ విద్యాశాఖ మంత్రి అశిష్ సూద్ వెల్లడించారు. స్వాతంత్య్ర సమరయోధులైన వీర్ సావర్కర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్‌లతో పాటు ఆరెస్సెస్ చరిత్రపై విద్యార్థులకు బోధించనున్నామని ఆయన తెలిపారు. ‘‘విద్యార్థులలో పౌర, సామాజిక స్పృహను, నైతికత, దేశభక్తిని పెంపొందించడానికి ‘రాష్ట్రనీతి’ పేరుతో ఒక అధ్యాయాన్ని జోడిస్తున్నాం’’ అని అశిష్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉపాధ్యాయ హ్యండ్‌బుక్‌లను తయారు చేసి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలికి పంపించామని, అక్కడ టీచర్లకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి మీడియాకు తెలిపారు.



















