రోడ్లు అద్దంలా మెరవాలని అందరికీ ఉంటుంది. కానీ చెత్త వేయకుండా ఉండేవారు మాత్రం తక్కువే. చాలామంది తెలిసీ తెలియక రోడ్లపై చెత్త వేస్తూనే ఉంటారు. అయితే, రోడ్లపై పడిన చెత్తను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి తోడ్పాటుగా ఆరు కొత్త యంత్రాలు రంగంలోకి దిగాయి. ఇన్‌ఆర్బిట్ మాల్ మరియు నిర్మాన్ (ఎన్జీవో సంస్థ) సంయుక్తంగా ‘స్పార్క్లింగ్ సైబరాబాద్’ పేరుతో రహదారులను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ లిట్టర్ పికర్ మెషీన్లను వినియోగంలోకి తెచ్చారు. వీటితో రహదారులపై ఉన్న పొడి చెత్తను సులభంగా సేకరించవచ్చు. ఒకేసారి 240 లీటర్ల చెత్తను మోసుకెళ్లే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉంది. ఐదు గంటల ఛార్జింగ్‌తో వీటిని రోజంతా సులభంగా నడపవచ్చని అధికారులు తెలిపారు.




















