కలిగిరి, న్యూస్‌టుడే: మండలంలోని ఏపినాపికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్‌కు ఎనిమిదేళ్ల క్రితం సరితతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అనకాపల్లి సమీపంలో మూడేళ్లుగా ఇటుకబట్టీల్లో విష్ణువర్ధన్ పనిచేస్తున్నారు. భార్యతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఆ క్రమంలో భర్తకు దూరంగా ఉంటున్న ఎం.ధనలక్ష్మితో సన్నిహితంగా ఉంటున్నారు. విషయం భార్యకు తెలియడంతో కొన్ని నెలలుగా ఏపినాపిలో అత్తామామల దగ్గరే ఉంటోంది. ఇటీవల విష్ణువర్ధన్ ధనలక్ష్మిని తీసుకువచ్చాడు. ఆమె తల్లిదండ్రులు ఈనెల 16న అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదైంది. వీరిద్దరూ ప్రకాశం జిల్లా పామూరులోని ఓ లాడ్జిలో ఉంటున్నట్లు బుధవారం సరితకు తెలియడంతో వారిని పోలీసుల సాయంతో కలిగిరికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కుటుంబ ఆస్తి తనకు వద్దని విష్ణువర్ధన్ సంతకం చేసి, ఆ ప్రతులను భార్యకు ఇచ్చారు. ఇదిలా ఉండగా అనకాపల్లి పోలీసులు, ధనలక్ష్మి కుటుంబసభ్యులు సమాచారం తెలుసుకుని శుక్రవారం కలిగిరి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆమెను వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లడంతో విష్ణువర్ధన్ సమీపంలోని దుకాణంలోకి వెళ్లి పురుగులమందు డబ్బాను కొనుగోలు చేసి అందరూ చూస్తుండగా రోడ్డుపై తాగేశాడు. గమనించిన భార్య, బంధువులు వెంటనే ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం గమనార్హం



















