ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను కొనసాగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ లేఖలో ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కొనసాగాలని ప్రజలు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో విడుదల చేసిన లేఖలో, గత మే నెలలో ఆరు నెలల కాల్పుల విరమణను ప్రకటించామని, ఆ సమయంలో శాంతి వాతావరణం నెలకొనేలా తమవంతు కృషి చేశామని పేర్కొంది. ఇప్పుడు ప్రజల అభిలాషలకు అనుగుణంగా ఆ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నామని తెలిపింది.
మావోయిస్టు పార్టీ ప్రకారం, తాము శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు మున్ముందు కూడా కృషి చేస్తామని, ప్రభుత్వంపైనా అదే ధోరణి కొనసాగించాలని కోరింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న ఈ శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని లేఖలో విమర్శించింది.
ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఒకే గొంతుతో ముందుకు రావాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో పిలుపునిచ్చారు.





















