తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మరియు పరిసర గ్రామాలను కలిపే రింగ్‌రోడ్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మధురపూడి, రాజానగరం, దివాన్‌చెరువు, సంపత్‌నగర్, కడియం మార్గంగా రింగ్‌రోడ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
రానున్న పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, కాలువల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. బొమ్మూరు నుండి సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల రోడ్డును రూ.100 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కర ఘాట్లను కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో ముంపు సమస్యను పరిష్కరించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.




















