దొనకొండలో బీడీఎల్ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఏప్రిల్‌లో మొదలు
2028 సెప్టెంబరులో ఉత్పత్తి ఆరంభం
1,600 మందికి ఉపాధి కల్పన
అమరావతిలో ప్రాజెక్ట్ స్థాపన
రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక రక్షణ సంస్థ రానుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్‌ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి 1,400 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొంది. ఇటీవల బీడీఎల్ ఉన్నతాధికారులు ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. భారత సాయుధ దళాలకు అవసరమైన మిసైళ్లు, ఇతర కీలక ఆయుధాలను డీఆర్డీవో సహకారంతో ఇక్కడ తయారు చేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించింది.
ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో రూ.2,400 కోట్ల వ్యయంతో కల్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్స్ లిమిటెడ్ ఆధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్ స్థాపన జరుగుతోంది. బీడీఎల్ యూనిట్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం రక్షణ పరికరాల తయారీ, పరిశోధన రంగాల్లో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
బీడీఎల్ యూనిట్ ప్రత్యేకతలు
సెన్సర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్షిపణులు, తుపాకుల వంటి ఆయుధాలు సమర్థవంతంగా పనిచేయడానికి అనేక విభాగాల సమన్వయం అవసరం. వాటిని ఏకీకృతం చేసి ముందుకు నడిపించే ఇంజినీరింగ్ సిస్టమ్స్‌ను బీడీఎల్ అభివృద్ధి చేయనుంది. ఈ సాంకేతికత ద్వారా నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సమగ్ర వ్యవస్థలు ఏర్పడతాయి. అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ అవసరాల కోసం వెయ్యి టన్నుల వరకు పేలోడ్‌ను మోయగల రాకెట్ మోటార్లను కూడా ఈ యూనిట్లో తయారు చేయనుంది.
2026 మార్చి నాటికి యూనిట్ ఏర్పాటు కోసం అవసరమైన అనుమతులు పూర్తవుతాయని, అనంతరం వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని డీపీఆర్‌లో పేర్కొంది. నిర్మాణం 2028 మార్చిలో ముగిసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదే ఏడాది జూన్ నాటికి యంత్రాలు అమర్చి, సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రతిపాదనలో వెల్లడించింది.
మౌలిక వసతుల ప్రతిపాదనలు
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి దాదాపు 8 కి.మీ.ల మేర రెండు లేన్ల అప్రోచ్ రోడ్డు, రోజుకు 25 వేల కిలోవాట్ల విద్యుత్ సరఫరా, రోజుకు 2 వేల కిలోలీటర్ల నీటి అవసరం కోసం ప్రత్యేక సదుపాయాలను బీడీఎల్ ప్రతిపాదించింది.
బీడీఎల్ తొలి దశలో రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అనంతరం రెండో దశలో మరో రూ.550 కోట్ల వ్యయంతో యూనిట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనుంది.
ఈ యూనిట్లో వెయ్యి టన్నుల సామర్థ్యం గల ప్రొపెల్లెంట్ మోటార్లు, 130 సమీకృత ఆయుధ వ్యవస్థలు తయారు చేయనున్నట్లు ప్రణాళికలు రూపొందించాయి.
మొత్తం 1,200 ఎకరాల్లో ఆయుధ తయారీ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతుండగా, మిగిలిన 200 ఎకరాల్లో సుమారు 600 కుటుంబాలు నివసించగలిగేలా టౌన్షిప్ నిర్మించనుంది.
ఈ ప్రతిపాదనల మేరకు బీడీఎల్‌కు 1,346.67 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అందులో ప్రభుత్వ స్వాధీనం లో ఉన్న 317 ఎకరాలను ఎకరానికి రూ.7.73 లక్షల చొప్పున ఇవ్వాలని భావిస్తోంది. మిగిలిన అవసరమైన భూములను సేకరించడానికి చర్యలు చేపట్టనుంది.



















