అధికార, విపక్ష సభ్యులందరూ అసెంబ్లీకి హాజరైనట్లయితే చర్చలు ఎంత సార్ధకంగా సాగుతాయో మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు అద్భుతంగా చూపించారు. సభా గౌరవాన్ని కాపాడుతూ.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ద్వారా ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో వివరించారు. ప్రజా ప్రతినిధులపై వారు ఒత్తిడి చేయకుండా, మాక్ అసెంబ్లీని న్యాయవంతంగా, ఆకట్టుకునే విధంగా నిర్వహించారు. ప్రశ్నోత్తరాల్లో అనుబంధ ప్రశ్నలను సభ్యులు ఎలా వినియోగించుకోవచ్చో, శూన్యగంటలో ప్రజా సమస్యలను ఎలా వెలుగులోకి తీసుకురావచ్చో స్పష్టంగా ప్రదర్శించారు.
విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలపై అవగాహన కల్పించేందుకు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఈ మాక్ అసెంబ్లీకి 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 26 మంది మంత్రులు, సభాపతి, ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. మంత్రులుగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థులు అదరగొట్టారు. సభాపతిగా కాకినాడ జిల్లా స్వాతి సమర్ధవంతంగా సమావేశాన్ని నడిపించారు. సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలాగౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన ఎల్. సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖపట్నం జిల్లా కోడి యోగి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీ నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రశంసలు తెలిపారు.
విద్యార్థులు సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్యేలు పాత్రల్లోకి ప్రవేశించి.. సభను ప్రారంభం నుండి ముగింపు వరకు ఆకట్టుకునే విధంగా నిర్వహించారు. అమరావతి అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో మాక్ అసెంబ్లీ అసలు శాసనసభకు ఏ మాత్రం తగ్గకుండా సాగింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు పోటీపడి తమ పాత్రలను నిర్వర్తించారు. ప్రతిపక్ష సభ్యులు సభాపతి పోడియం వద్దకు వెళ్లి గొడవ చేయడం, మార్షల్స్ వచ్చి అడ్డుకోవడం వంటి క్షణాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రతిపక్షంపై విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన మేఘన విమర్శలతో ప్రశ్నోత్తరాలు ఆసక్తికరంగా సాగాయి.
సభాపతి ఎన్నిక
మాక్ అసెంబ్లీలో ముందుగా సభాపతి ఎన్నిక జరిగింది. ప్రొటెం స్పీకర్ రాగానే సభ్యులు లేచి నిలబడ్డారు. సభాపతిగా స్వాతి పేరును ఎమ్మెల్యేగా వ్యవహరించిన లోకేశ్వర్ రెడ్డి ప్రతిపాదించారు. మరో సభ్యుడు అనిల్‌కుమార్ ప్రతిపాదించాడు. ఇతర ప్రతిపాదనలు లేనందున స్వాతిని సభాపతిగా అధికారికంగా ప్రకటించారు. సభాపతి మాట్లాడుతూ – ‘‘ఈ కుర్చీకి కుడి, ఎడమలు ఉండవు. రాజ్యాంగం, సభా నియమాలు పాటించాలి. ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను. సభా గౌరవం కాపాడడం మనందరి బాధ్యత’’ అన్నారు.
ప్రశ్నోత్తరాలు & శూన్యగంట
ప్రశ్నోత్తరాలు, శూన్యగంటలో రెండు బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి. వివిధ శాఖలపై 10 ప్రశ్నలు అడిగి, మంత్రులు సమాధానాలు ఇచ్చారు. శూన్యగంటలో తుపాను సమయంలో వేటకు వెళ్లని మత్స్యకారులకు ఉపాధి హామీ పథకం కింద వేతనం చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పడం ఆకట్టింది.
ఒలింపిక్స్ చర్చ
ప్రశ్నోత్తరాల్లో ఒలింపిక్స్‌పై ఆసక్తికర చర్చ జరిగింది. ప్రతిపక్ష సభ్యుడు ప్రతిపాదిస్తూ – ‘‘మన స్థానిక క్రీడలైన కోతి కొమ్మచ్చి, గిల్లీదండని ఒలింపిక్స్‌లో చేర్చాలని లేఖ రాయండి’’ అని చెప్పగా, క్రీడల మంత్రి సమాధానంగా – ‘‘మ్యూజికల్ చైర్స్, గోడ దూకడం వంటి ఆటలు చేర్చితే మనకు బంగారపు, రజత పతకాలు దక్కుతాయి’’ అని వ్యాఖ్యానించారు.
సభలో మార్షల్స్
పర్యావరణ బిల్లుపై ప్రతిపక్షం విరోధం తెలిపింది. వెల్‌లోకి దూసి నిరసన చూపించగా, అధికారపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళనను పెంచారు. మార్షల్స్ రంగంలోకి దిగి ఒక సభ్యుడిని బయటకు తరలించారు. రెండు బిల్లులకు ఆమోదం వచ్చిన తరువాత సభాపతి సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు.
గ్రూప్ ఫొటో & ముగింపు
మాక్ అసెంబ్లీ ముగిసిన తర్వాత ‘భారత రాజ్యాంగం పిల్లల కోసం’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సీఎం, సభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు విద్యార్థులతో గ్రూప్ ఫొటో తీశారు. మంత్రి లోకేశ్ విద్యార్థులను మళ్లీ శాసనసభ, మండలి హాల్ చూపించి, వారితో భోజనం చేశారు.Tools



















