దిల్లీ: నమో అంటే నరేంద్రమోదీ మాత్రమే కాదు.. నాయుడు, మోదీ కలయిక అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుధవారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి మూడు కీలక కారణాలు ఉన్నాయని లోకేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు, వేగవంతమైన ప్రక్రియ, ఎకో సిస్టమ్ అని వివరించారు. మంచి సంబంధాలు నెలకొల్పుతున్నందునే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
‘‘పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకమన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయి. ఐటీ, తయారీ, సేవలు, పర్యాటక రంగాలు చాలా కీలకం. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది. వికసిత్ భారత్ విజన్ మేరకు ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్నాం. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రగతి దిశగా పయనిస్తున్నాం. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు జరుగుతోంది. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశమిచ్చిన సీఐఐకి ధన్యవాదాలు. ప్రభుత్వం, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులకు ఇదో అవకాశం. క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్స్ తదితర రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. సీఐఐ సదస్సులో 410 ఎంవోయూలు జరుగుతాయని భావిస్తున్నాం. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. పెట్టుబడుల ద్వారా 7.5లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి’’ అని లోకేశ్ తెలిపారు.




















