మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలతో పాటు, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసమే రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తాజాగా ముందుకు వచ్చింది. రంపచోడవరం, చింతూరు డివిజన్లు తూర్పుగోదావరి జిల్లాలో కలిస్తే జిల్లా పరిమాణం మరింత విస్తరించి పెద్దదిగా మారుతుందని భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై మంగళవారం మళ్లీ సమీక్షించాక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు ప్రతిపాదనలను కలిగిన ప్రజెంటేషన్‌ను సీఎంకు అందించగా, ఆయన మరిన్ని సూచనలు చేశారు. మార్కాపురం (ప్రకాశం జిల్లా), మదనపల్లె (అన్నమయ్య జిల్లా), రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం సూత్రప్రాయ సమ్మతి తెలిపారు. అవసరం మేరకే పరిమిత మార్పులు చేయాలని సూచించారు.
పెనమలూరు – ఎన్టీఆర్ జిల్లాలో చేర్చరా?
విజయవాడ నగరంలో భాగమైన పెనమలూరును పక్కనపెట్టి, దూరంగా ఉన్న గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో చేర్చే ప్రతిపాదనపై సీఎం ప్రశ్నించారు. భౌగోళిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల మార్పులపై కొద్దిసేపు చర్చ జరిగింది. గన్నవరం (కృష్ణా), నూజివీడు (ఏలూరు) నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రతిపాదించగా, పెనమలూరుపై ఆలోచించకపోవడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మార్పులపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దదవుతుందనే ఆందోళన
రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందుతున్నాయి. చింతూరు నుంచి జిల్లా కేంద్రం పాడేరు వరకు దూరం 215 కి.మీ. ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బంది. ఈ రెండు డివిజన్లు తూర్పుగోదావరిలో కలిస్తే జిల్లా జనాభా 24.48 లక్షలుగా, నియోజకవర్గాల సంఖ్య 10గా పెరుగుతుందని అంచనా. పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు పరిష్కారంగా పరిశీలిస్తున్నారు. ముంపు గ్రామాల వివరాలతో అధికారులు నివేదిక రూపొందించారు. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రకాశం జిల్లాకు అద్దంకి, కందుకూరు
అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. బనగానపల్లె డివిజన్ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలిసింది. గూడూరు డివిజన్‌ను తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులోకి, నగరి డివిజన్‌ను చిత్తూరు నుంచి తిరుపతి జిల్లాలోకి చేర్చే ప్రతిపాదనలపై కూడా చర్చ జరుగనుంది.



















