వరదలు, తరచూ జరిగే ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విజయవాడలో చెరువులా మారిన రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ‘‘ఇక్కడ గుంతలు లేవు.. నిశ్చింతగా వెళ్లొచ్చు’’ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని వాహనదారులకు ధైర్యం చెబుతున్నారు.
ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల వద్ద కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి చిన్న వర్షానికే చెరువులా మారుతోంది. ఫలితంగా ట్రాఫిక్ నిలిచిపోగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం కురిసిన వర్షంతో రహదారి పూర్తిగా నీటమునిగిపోయింది. నీటిలో గుంతలు కనిపించక వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణిస్తుండగా, ట్రాఫిక్ పోలీసు ఒకరు ప్లకార్డు పట్టుకుని ‘‘ఇక్కడ గుంతలు లేవు, మీరు భయపడకుండా వెళ్లొచ్చు’’ అంటూ వారిని ధైర్యం చెప్పారు.



















