హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 47 ఏళ్ల తర్వాత మహిళల విభాగంలో టీమ్ ఇండియా ట్రోఫీని అందుకుంది. ఈ విజయంతో 1983లో భారత పురుషుల జట్టు సాధించిన ప్రపంచకప్ విజయాన్ని పోలుస్తూ చర్చలు మొదలయ్యాయి. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందిస్తూ — ఇరువురి విజయాలను పోల్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మహిళల, పురుషుల జట్లు భిన్నమైన పరిస్థితుల్లో పోరాడి విజయాలు సాధించాయని ఆయన అన్నారు.
గావస్కర్ మాట్లాడుతూ — “1983లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచే వరకు ఒక్కసారి కూడా నాకౌట్ దశకు చేరుకోలేదు. కానీ మహిళల జట్టు ఈ విజయానికి ముందు రెండుసార్లు ఫైనల్ వరకు చేరి అద్భుత రికార్డు సృష్టించింది. పురుషుల క్రికెట్‌కు 1983 కప్ ప్రేరణనిచ్చింది. అప్పటి నుంచి ప్రపంచం భారత క్రికెట్‌ను గుర్తించింది. ఐపీఎల్ ప్రారంభం తర్వాత ఆర్థికంగా కూడా భారీ ఎదుగుదల కనిపించింది. క్రికెటర్లు మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలనుంచి కూడా రావడం ప్రారంభమైంది. ఇక మహిళల జట్టు ఈసారి కప్ గెలవడం ద్వారా సుదీర్ఘకాలంగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న దేశాలను సవాలు చేసింది” అని అన్నారు.
భారత మహిళల జట్టు 2005, 2017 ప్రపంచకప్ ఫైనల్స్‌లో కూడా ఆడినా, విజయాన్ని చేజార్చుకుంది. కానీ ఈసారి చివరి వరకు దృఢంగా ఆడి ఛాంపియన్‌గా నిలిచింది. ఇదే సమయంలో పురుషుల జట్టు 1983 విజయం తర్వాత 2003లో ఫైనల్ ఆడి ఓడిపోయింది. అనంతరం 2011లో ధోనీ నాయకత్వంలో మళ్లీ కప్ గెలుచుకుంది. అయితే, రోహిత్ శర్మ సారథ్యంలో 2023లో ఫైనల్ వరకు చేరినా విజేతగా నిలవలేదు.




















