అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
విజయవాడ, అక్టోబర్ 1: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో పదవ రోజుకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ… పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
తెప్పోత్సవంపై ఉత్కంఠ…
మరోవైపు కృష్ణా నదికి భారీ వరద నేపథ్యంలో అమ్మవారి తెప్పోత్సవంపై ఉత్కంఠ నెలకొంది. తెప్పోత్సవానికి ఎన్ఓసీ ఇవ్వడానికి జలవనరుల శాఖ నిరాకరించింది. 2022, 2023 సంవత్సరాలలో దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. మహా మండపంలో ఉత్సవమూర్తులను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు అధికారులు. గత ఏడాది వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నది ఒడ్డున హంస వాహనంపై పూజా కార్యక్రమం మాత్రమే నిర్వహించారు. మరి ఈ ఏడాది కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో అమ్మవారి తెప్పోత్సవంపై సస్పెన్స్ కొనసాగుతోంది.


















