తమిళ కథానాయకుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటించిన చిత్రం ‘బైసన్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాలో ధ్రువ్ (Dhruv Vikram) నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పశుపతి, అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్రల్లో కనిపించారు. ‘ఫీనిక్స్’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు విజయ్ సేతుపతి కుమారుడు, యువ కథానాయకుడు సూర్య సేతుపతి. ఇప్పుడాయన ‘నాడు సెంటర్’ అనే సిరీస్‌తో అలరించడానికి సిద్ధమయ్యారు. రెజీనా, శశికుమార్, కలైయరసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నారు నారాయణన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ వేదికగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
ప్రేక్షకులను విశేషంగా అలరించిన వెబ్ సిరీస్‌ల్లో ‘ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీమ్యాన్’ ఇప్పుడు మూడో సీజన్‌తో అలరించడానికి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దేశ రక్షణ కోసం ఏజెంట్‌గా పనిచేసిన శ్రీకాంత్ తివారీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎందుకు అయ్యాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? కుటుంబంతో కలిసి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అత్యంత క్రూరుడైన డ్రగ్ స్మగ్లర్ (జైదీప్ అహ్లావత్) నుంచి శ్రీకాంత్ కుటుంబానికి, దేశానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడిందనేది కథ. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో 1990ల్లో జమ్మూ-కశ్మీర్‌లో చెలరేగిన తిరుగుబాటును కళ్లకు కట్టేలా చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన రూపొందించిన మరో వాస్తవ సంఘటనల చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’ (The Bengal Files). మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1946 ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఈ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీ5లో హిందీలో అందుబాటులోకి వచ్చింది.























