కొన్ని కూరల్లో నూనె ఎక్కువ పడుతుంది. పనీర్ మసాలా కూడా అలాంటిదే. కానీ ఆ రెసిపీని నూనె అసలే వేయకుండానూ చేయొచ్చు.
పనీర్ మసాలా కోసం- ఉల్లి తరుగు – అర కప్పు, టొమాటో ముక్కలు – కప్పు, పనీర్ – 200 గ్రాములు, లవంగాలు – 3, యాలకులు – 2, జీడిపప్పు – పావు కప్పు, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి – 2 రెబ్బలు, ఉప్పు – రుచికి తగినంత, పచ్చిమిర్చి – 2, దాల్చినచెక్క – చిన్న ముక్క, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – చెంచా, కశ్మీరీ మిర్చి – 6, కొత్తిమీర తరుగు – గుప్పెడు, తాజా క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు, కసూరీ మేథీ, పంచదార – చెంచా చొప్పున తీసుకోవాలి. ఎలా చేయాలంటే.. ప్యాన్‌లో దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు, లవంగాలు, ఎండుమిర్చిలను వేయించాలి. వాటిని పళ్లెంలోకి తీసి.. జీడిపప్పును వేయించాలి. దాన్ని కూడా తీసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగులను వేయించాలి. లేత గోధుమ రంగులోకి మారాక టొమాటో ముక్కలు జతచేయాలి. మెత్తగా ఉడికిందనుకున్నాక సెగ తీసేయాలి. అన్నీ చల్లారాక ఉప్పు, పంచదార చేర్చి గ్రైండ్ చేయాలి. కడాయిలో క్రీమ్ వేడిచేసి పనీర్ ముక్కలను వేయించాలి. అందులో గ్రైండ్ చేసిన మిశ్రమం జోడించాలి. నాలుగైదు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లితే చాలు నూనె లేని పనీర్ మసాలా సిద్ధం.




















