“జనసేన నాయకులు, శ్రేణులు పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థాయిల వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. వారి ప్రాంత అభివృద్ధిలో, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించడానికి శ్రేణులను ముందుకు తీసుకెళ్దాం.”
పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ, మండల, శాసనసభ, లోక్‌సభ స్థాయిలలో ఐదుగురు సభ్యులతో కమిటీలను నియమించాలని, వారిని పార్టీ కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనుల్లో భాగస్వాములుగా చేయాలని సూచించారు. ప్రతి కమిటీలో మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి, కనీసం ఒకరు లేదా ఇద్దరు మహిళలకు స్థానమివ్వాలని ఆదేశించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో ప్రయోగాత్మక కమిటీ ఏర్పాటు చేసి పనితీరును అంచనా వేసి, ఇతర కమిటీల రూపకల్పన చేయాలని సూచించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్యులతో సమావేశమై రాష్ట్ర స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు నామినేటెడ్ పదవులపై సమీక్ష నిర్వహించారు. మిగిలిన పోస్టుల భర్తీపై కూడా సూచనలు ఇచ్చారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ, పార్టీ కోసం కృషి చేసిన వారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలను ఇవ్వాలని పేర్కొన్నారు.
11 మందితో వివాద పరిష్కార విభాగం
పార్టీ అంతర్గత వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర కార్యాలయం నుంచి కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందులో 11 మంది సభ్యులను నియమించాలని, ముగ్గురు మహిళలకు స్థానమివ్వాలని సూచించారు. వివాద తీవ్రతను బట్టి ఈ కమిటీ సభ్యులు చర్చించి పరిష్కారం చూపాలి.


















