నౌకాదళ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది
వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా తో సీఎం చంద్రబాబు భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్‌చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా తో భేటీ అయ్యారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రిని వైస్ అడ్మిరల్ భల్లా మర్యాద పూర్వకంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ భల్లా ప్రధానంగా వివరాలు అందించగా, భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రంలో ఆహ్వానించే అవకాశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను అనుసరించి స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతికతకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు.
తూర్పు నావికా దళం నిర్వహించే ఫ్లీడ్ రివ్యూలకు ప్రజల నుంచి వస్తున్న ఉత్సాహపూరిత స్పందనపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ అనేక అవకాశాలకు కేంద్రంగా, ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రంగా మారబోతోందని, భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దాలన్న దిశలో రాష్ట్ర ప్రభుత్వం, నావీ కలిసి పనిచేయాలని సూచించారు. అలాగే విశాఖను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మారుస్తూ, అత్యుత్తమ టూరిజం సెంటర్‌గా కూడా తీర్చిదిద్దే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
సమావేశంలో సీఎం చంద్రబాబు నావీకి కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాకుండా, విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయడం ముఖ్యమని, నావీ మ్యూజియంలాంటి ఏర్పాట్ల ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఏపీలో రక్షణ రంగంలో చేరేందుకు యువత చూపుతున్న ఆసక్తి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక, నావీ చేపట్టే వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూమిని రాష్ట్రం అందించడానికి సిద్ధంగా ఉందని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు తెలిపారు.























