కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో జరిగిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భూమి ఆత్మగౌరవం, సంస్కృతి, సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా నిలుస్తోందని అన్నారు.
“అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడిని నమస్కరిస్తున్నాను. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జ్యోతిర్లింగం సోమనాథుడి నేలలో జన్మించాను, విశ్వనాథుడి కాశీ సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఈ పవిత్ర ఆంధ్రభూమిలో ఉన్నందుకు గర్వంగా ఉంది” అని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు సరైన విజన్, సరైన నాయకత్వం అవసరమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపంలో రాష్ట్రానికి శక్తివంతమైన నాయకత్వం లభించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తోంది, గత 16 నెలలుగా ఏపీ అభివృద్ధి శరవేగంగా సాగుతోందని చెప్పారు.
డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతిని సాధిస్తోందని మోదీ తెలిపారు. ఢిల్లీ, అమరావతి రెండూ వేగంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. “2047 నాటికి భారత్ వికసిత్ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దం అవుతుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రధాని మాట్లాడుతూ, ప్రాజెక్టులు రాష్ట్ర కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, పరిశ్రమలకు ఊతం ఇవ్వడమే కాక ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. “ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత చాలా కీలకం. ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు దేశ ఇంధన సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. విద్యుదీకరణతో ప్రతి గ్రామం వెలుగొందుతోంది, తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగింది” అని వివరించారు.
ప్రధాని మోదీ, చిత్తూరు ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ రోజుకు 20 వేల సిలిండర్లు నింపగలదని, సహజ వాయువు పైప్‌లైన్ ద్వారా 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా జరుగుతోందని తెలిపారు. “వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మల్టీమోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు కీలకం అవుతున్నాయి. సబ్బవరం–షీలానగర్ హైవే వంటి ప్రాజెక్టులు కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తాయి” అని చెప్పారు.
గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని, ఈ ప్రాజెక్టు భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికి సేవలు అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
“భారత్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అవసరం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాయలసీమ ప్రగతి తప్పనిసరి. ఈ ప్రాజెక్టులు రాయలసీమ జిల్లాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయి, పరిశ్రమల ప్రగతికి కొత్త ద్వారాలు తెరుస్తాయి. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది” అని మోదీ స్పష్టం చేశారు.
మోడీ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతోంది. రాష్ట్రం సామర్థ్యం, దేశం వేగం – రెండింటినీ ప్రపంచం గమనిస్తోంది” అని గర్వంగా అన్నారు.
“డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతికి రెక్కలొచ్చాయి, స్వర్ణాంధ్ర లక్ష్యం వైపు మేము వేగంగా కదులుతున్నాం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.























