ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్‌చీఫ్ కె. నరసింహమూర్తి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు బుధవారం రాసిన లేఖలో సూచించారు.
ఈ జలాశయాలకు ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి గణనీయమైన ప్రవాహాలు లేవని, అలాగే దిగువ ప్రాంతాల్లో తక్షణ అవసరాలు కూడా లేవని పేర్కొన్నారు. అయినప్పటికీ విద్యుదుత్పత్తి కొనసాగించడం వల్ల జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి అవసరాలు దెబ్బతినకుండా విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని సూచించారు.
ఇంతకుముందు కర్నూలు చీఫ్ ఇంజినీరు కూడా శ్రీశైలం ఎడమ గట్టు (తెలంగాణ), కుడి గట్టు (ఆంధ్రప్రదేశ్) అధికారులకు వేర్వేరుగా లేఖలు రాసి విద్యుదుత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. చెన్నై నగరం, రాయలసీమ కరవు ప్రాంతాలకు తాగునీటి సరఫరా కొనసాగించడానికి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కుడి గట్టు వైపు విద్యుదుత్పత్తిని క్రమంగా తగ్గిస్తుండగా, తెలంగాణ మాత్రం ఉత్పత్తిని కొనసాగిస్తున్నదని నరసింహమూర్తి తన లేఖలో వివరించారు.



















