నిర్మాణాల్లో జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశం – రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో ఆలస్యం జరగరాదు
అమరావతి, అక్టోబర్ 31:
రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత సమయానికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. జాప్యం లేకుండా వేగంగా, నాణ్యతతో నిర్మాణాలు జరగాలన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశం నిర్వహించి, నిర్మాణాల పురోగతి, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై సీఎం సమీక్షించారు.
సీఎం మాట్లాడుతూ, “ఏ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, వర్క్‌ఫోర్స్ స్థితి, మెటీరియల్ సరఫరా, మెషినరీ లభ్యత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. ప్రతి భవనం నిర్దేశిత గడువులో పూర్తవ్వాలి” అని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. వర్షాల కారణంగా తాత్కాలిక జాప్యం జరిగినా, రాబోయే రోజుల్లో ఆ లోటును భర్తీ చేసేలా వేగం పెంచాలని సూచించారు.
సీఎం చంద్రబాబు ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని తెలిపారు. కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు ఇంకా వర్క్‌ఫోర్స్, మెషినరీ పూర్తిగా కేటాయించలేదని గుర్తుచేసి, తక్షణమే పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా గనుల శాఖతో సమన్వయం చేయాలని అధికారులకు సూచించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి
రాజధాని భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని సీఎం ఆదేశించారు. ఇంకా 2,471 మంది రైతుల ప్లాట్లు సాంకేతిక కారణాలు, వ్యక్తిగత అంశాల వల్ల పెండింగులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం సూచించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “త్వరలోనే నేను స్వయంగా రాజధాని రైతులను కలుస్తాను. నిర్మాణాలకే కాదు, గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి” అన్నారు. ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు ఐకానిక్ మోడల్‌లో ఉండాలని, అమరావతిని వరల్డ్ క్లాస్ సిటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.





















