ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. నేడు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని అంచనా. మిగతా జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, సముద్ర తుఫాన్ ప్రభావంతో విశాఖ, గంగవరం, కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల్లోని ప్రజలు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.




















