విశాఖపట్నం వచ్చే మూడు నుండి నాలుగు సంవత్సరాల్లో డేటా సెంటర్ల కేంద్రంగా ఎదగబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు వరుసగా అక్కడ డేటాసెంటర్ల స్థాపనకు ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ కనెక్షన్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా 1,000 మెగావాట్ల సామర్థ్యంతో డేటాసెంటర్‌ను 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. రూ.98 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ ఆధారిత ఈ డేటా సెంటర్‌ను 2030 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆ సంస్థ ప్రతినిధులు సీఎం తో సమావేశమై ప్రాజెక్టుపై చర్చించారు. భూమి కేటాయింపు, ఇతర నిర్మాణ అంశాలపై చర్చలు పూర్తయ్యాక ప్రభుత్వం మరియు రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఇప్పటికే రూ.1.33 లక్షల కోట్లతో 1,000 మెగావాట్ల ఏఐ డేటాసెంటర్ స్థాపనకు గూగుల్ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. అలాగే బ్రూక్‌ఫీల్డ్ సంస్థ రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. సిఫీ టెక్నాలజీస్ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో డేటాసెంటర్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేసింది.
రిలయన్స్ డేటాసెంటర్ ప్రత్యేకతలు
400 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ డేటాసెంటర్, గుజరాత్‌లోని జామ్‌నగర్ కేంద్రానికి అనుబంధంగా పనిచేస్తుంది. జీపీయూ, టీపీయూ, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా సురక్షితంగా నిల్వ చేసే విధంగా అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఫీడర్లు, సబ్‌స్టేషన్లతో అత్యున్నత మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఇది ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ డేటా నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలవనుందని అధికారులు చెప్పారు.
ప్రభుత్వం లక్ష్యసాధనలో సగం దూసుకెళ్లింది
విశాఖలో మొత్తం 6,000 మెగావాట్ల డేటాసెంటర్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం. వాటిని 2030 నాటికి పూర్తిగా కార్యకలపాల్లోకి తేవాలని నిర్ణయం. ప్రస్తుతం గూగుల్, రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ సంస్థల నుంచే 3,000 మెగావాట్ల డేటాసెంటర్లు ఖరారయ్యాయి. మరికొన్ని అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయి. అవసరమైన భూములు, అనుమతులపై చర్యలు వేగవంతం అయ్యాయి.
మంత్రి లోకేశ్ స్పందన
విశాఖలో రిలయన్స్ రూ.98 వేల కోట్లతో 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటాసెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయంపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ త్వరలోనే భారతదేశ డేటా రాజధానిగా ఎదగనుందని పేర్కొన్నారు.



















