మృదువైన గులాబీ రేకులతో మధుమేహం మూలంగా పాదాలకు పడే పుండ్లు నయమైతే ఎలా ఉంటుంది? ఇది ఊహ కాదు, నిజంగానే సాధ్యమని శివ్ నాడర్ యూనివర్సిటీ, ఐఐటీ భిలాయ్ పరిశోధకులు నిరూపించారు. గులాబీ రేకుల నుంచి సంగ్రహించిన అతి సూక్ష్మమైన ముక్కలు (ఆర్‌ఈవీ).. యూరియా, సిట్రిక్ ఆమ్లం వంటి సాధారణ పదార్థాల నుంచి తీసిన కర్బన రేణువుల (సీడీ) సమ్మేళనంతో వినూత్న ద్రవజిగురును తయారుచేశారు. దీన్ని పుండ్ల మీద నేరుగా లేపనం చేస్తే చాలు. నయం చేసే రసాయనాలు, బ్యాక్టీరియాను నిర్మూలించే కారకాలు నెమ్మదిగా విడుదలవుతాయి. ఆర్‌ఈవీలు చర్మకణాలు, కొత్తరక్తనాళాలు వృద్ధి చెందేలా, వాపును తగ్గించేలా చేస్తాయి. ఇక సీడీలేమో ఆక్సీకరణ ఒత్తిడిని సృష్టించటం ద్వారా ఇ.కొలి వంటి బ్యాక్టీరియా కణ గోడలకు చిల్లులు పడేలా చేసి, వాటిని నిర్మూలిస్తాయి. ఫలితంగా పుండ్లు త్వరగా నయమవుతాయి.
వెండి ఆధారిత కట్లు, ఖరీదైన గ్రోత్ ఫ్యాక్టర్ చికిత్సలతో పోలిస్తే ఇది చాలా చవక. విష పూరితం కాదు. కొంతకాలానికి తనకు తానే సహజంగా క్షీణిస్తుంది. ఈ గులాబీ రేకుల లేపనాన్ని మధుమేహం గల ఎలుకల పుండ్ల మీద పరీక్షించగా మంచి ఫలితం కనిపించింది. పుండ్లు 50-70% ఎక్కువ వేగంగా నయమయ్యాయి. బ్యాక్టీరియా మోతాదులైతే 99% కన్నా తక్కువకు పడిపోయాయి. పుండ్లు నయమయ్యే క్రమంతో బలమైన కొలాజెన్, వ్యవస్థీకృతమైన కొత్త చర్మ పొరలు ఏర్పడినట్టు తేలింది. అంటే మచ్చలు పడకుండా పుండ్లను నయం చేస్తోందన్నమాట. కదులుతున్నప్పుడూ ఈ ద్రవజిగురు స్థిరంగా ఉండటం, రక్తంలో గానీ చర్మంలో గానీ ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకపోవటం గమనార్హం.




















