దిల్లీలో మంగళవారం విజయ్‌కుమార్ మల్హోత్రా పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ
దిల్లీ: భాజపా సీనియర్ నేత, దిల్లీలో పార్టీ మొదటి అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా (93) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయన ఐదుసార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ దిల్లీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మన్మోహన్ సింగ్(మాజీ ప్రధాని)ను ఓడించారు. ప్రజల సందర్శనార్థం మల్హోత్రా భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు పండిత్ పంత్ మార్గ్‌లోని భాజపా కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం లోధీ రోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. మల్హోత్రా అధికార నివాసంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు తుది నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మాజీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.




















