ఇంటర్నెట్ డెస్క్: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతిచెందిన విషయం తెలిసిందే (Zubeen Garg). ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నార్త్‌ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంత, జుబీన్‌గార్గ్ మేనేజర్ సిద్ధార్థశర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహంతను అరెస్ట్ చేయగా గురుగ్రామ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో శర్మను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరినీ గువాహటికి తరలించినట్లు తెలిపారు.
జుబీన్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్ ఇళ్లలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇటీవల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సౌండ్ రికార్డిస్ట్ నివాసంలోనూ తనిఖీలు జరిగాయి. ఇక ఇప్పటికే ఈ కేసు విషయంలో మ్యుజీషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. జుబీన్ మరణానికి ముందు ప్రయాణించిన నౌకలో ఉన్న బృందంలో గోస్వామి కూడా ఉన్నారని అందుకే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.




















