న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశ రాజధాని న్యూఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
దీపావళి సందర్భంగా అక్టోబర్ 18 నుంచి 21 వరకు, ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే గ్రీన్ క్రాకర్స్ వినియోగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, ఆన్‌లైన్ విక్రయాలపై నిషేధం విధిస్తూ, కేవలం క్యూఆర్ కోడ్ ఉన్న అనుమతించిన గ్రీన్ క్రాకర్స్‌నే ఉపయోగించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ప్రభుత్వానికి సూచించింది.
వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న న్యూఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో, పర్యావరణహిత పద్ధతిలో పండగ జరుపుకోవడానికి ఈ తీర్పు మార్గం సుగమం చేసింది.




















