న్యూ ఢిల్లీ: వీధి కుక్కల స్టెరిలైజేషన్ అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆగస్టు 22న ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత కూడా ఇప్పటివరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని కోర్టు మండిపడింది. రోజూ మీడియాల్లో వీధి కుక్కల దాడుల వార్తలు వస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు చలనం చూపడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో, తదుపరి విచారణలో స్పందించని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు (సీఎస్‌లు) వ్యక్తిగతంగా హాజరుకావాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేస్తూ — సీఎస్‌లు హాజరుకాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, ఇచ్చే వివరణలు సంతృప్తికరంగా లేకుంటే జరిమానాలతో పాటు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
“ఇంత ముఖ్యమైన ప్రజా సమస్యపై ఇంత తాత్సారం ఎందుకు?” అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


















