పది నెలల చిన్నారి హన్సిక అదృష్టం కనబరిచింది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక పరిధిలోని గణేశ్‌నగర్‌లో రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం, అందులోని ఇల్లు లక్కీడ్రాలో కేవలం రూ.500కే ఆమె సొంతమైంది. ఆదివారం జరిగిన లక్కీడ్రాలో హన్సిక పేరే విజేతగా ప్రకటించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో హోటల్‌లో పనిచేస్తున్న శంకర్ — భార్య ప్రశాంతి, కుమార్తెలు సాయి రిషిక, హన్సికల పేర్లతో నాలుగు కూపన్లు కొనుగోలు చేశారు. అందులో హన్సిక పేరు అదృష్టవశాత్తు ఎంపికైంది.
ఈ లక్కీడ్రా ఆలోచన స్థలం యజమాని కంచర్ల రామబ్రహ్మం చేపట్టారు. డబ్బు అవసరంతో ఇంటిని అమ్మే క్రమంలో ఆయన వినూత్న పద్ధతిని అవలంబించి, రూ.500కే కూపన్లు విడుదల చేశారు. నవంబర్ 2న డ్రా తీసి విజేతకు స్థలంతో పాటు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రకటించారు. ఆ ఆలోచన ఆకట్టుకోవడంతో 3,600 మంది కూపన్లు కొనుగోలు చేసి మొత్తం రూ.18 లక్షలు సమకూరాయి.
డ్రాలో హన్సిక పేరు వచ్చిందని నిర్వాహకులు ఫోన్‌లో తెలియజేయగానే చిన్నారి తండ్రి శంకర్ ఆనందంతో ఉప్పొంగిపోయారు.




















